స్థానిక సమరానికి కాంగ్రెస్ సై !

Telangana Congress

  • ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జిగా వంశీ చంద్ రెడ్డి నియామకం
  • ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇంచార్జీలను నియమించిన అధిష్టానం
  • పార్టీ సన్నాహక సమావేశాలకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ శ్రీకారం

స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సమాయత్తమవుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గానికి డాక్టర్ పి. శ్రావణ్ కుమార్ రెడ్డిని, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్ రావును ఇంచార్జులుగా నియమించిన అధిష్టానం, సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జిగా వంశీ చంద్‌ రెడ్డిని నియమించింది. తక్షణమే క్షేత్ర స్థాయిలో పని మొదలు పెట్టాలని ఆదేశించింది. 

Vamshi Chand Reddy


సన్నాహక సమావేశాలకు శ్రీకారం 

ఒక వైపు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తూనే, మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు జిల్లా నాయకత్వం నడుం బిగించింది. మొన్న హైదారాబాద్లో జరిగిన పార్టీ సమావేశంలో జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చేసిన సూచనలు, దిశా నిర్ధేశంతో ఖమ్మం జిల్లా నాయకులు సోమవారం పార్టీ సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. తొలి సమావేశాన్ని సత్తుపల్లి నియోజక వర్గంలో నిర్వహించారు. ముందుగా, ఖమ్మం నుండి సన్నాహాక సమావేశానికి ర్యాలీగా బయలు దేరిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ కు  జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్ది సాగనంపారు. జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు భానోత్ సోమ్లా నాయక్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సన్నాహక సమావేశాల్లో భాగంగా, పార్టీ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలు ఏర్పాటు చేసి, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు క్షేత్ర స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తారు. జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతోంది. ఇప్పటికే, స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, పాలేరు నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్థానిక నాయకులకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపధ్యంలో, దానిపై స్పష్టత రాకుండానే, కాంగ్రెస్ స్థానిక సమరానికి శంఖారావం పూరించడం చర్చనీయాంశంగా మారింది.  

Puvvalla Durga Prasad


Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి